- సంయమనం పాటించండి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా
- నారాయణపూర్ గ్రామస్తులతో భేటీ
కరీంనగర్ టౌన్, వెలుగు: నారాయణపూర్ రిజర్వాయర్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, అప్పటివరకు సంయమనం పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్‌ను కోరారు.
లేదంటే గ్రామస్తులకు అనువైన ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించానని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నారాయణపూర్ గ్రామానికి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. నారాయణపూర్ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ.. పాక్షికంగా ముంపునకు గురయ్యే వారికి కూడా తగిన పరిహారం కల్పించేలా ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు. కమిటీ వేసి గ్రామస్తుల సమస్యలను సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, తహసీల్దార్ రజిత తదితరులు
పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
రామడుగు, వెలుగు: అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను శ్రద్ధతో పరిష్కరించాలని ఎమ్మెల్యే సత్యం సూచించారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అంతకుముందు అధికారులు శాఖల వారీగా నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతువేదికలో 98 మందికి దాదాపు రూ.3 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ తిరుమల- తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ కోల రమేశ్, తహసీల్దార్ రాజమల్లయ్య, ఎంపీడీవో రాజేశ్వరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జె.హరీశ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
